వినాయక చవితి నక్త వ్రతమా (అంటే సాయంత్రం నక్షత్రోదయంలో చేయవలసిన వ్రతమా ? మరో ముఖ్య మీమాంసపై చర్చ
వ్రతంలొ చెప్పిన పురాణోక్త కథ ప్రకారం… (వ్రతకల్పం)
పూర్వపక్షం: – విశేషేణ “నక్తం” కుర్యాచ్చ తద్వ్రతమ్ …. అని స్కాందంలో ఉంది కాబట్టి ఇది నక్త వ్రతం సాయంత్రం నక్షత్రోదయ సమయంలో చేయాలి….
వివరణాత్మక చర్చ:
స్కాంద పురాణం ప్రకారం చెప్పబడిన శ్యమంతకోపాఖ్యానం లో “సదా కృష్ణపక్ష చతుర్థి వ్రతం – నక్తవ్రతం” అంటే “సంకష్ట చతుర్థి వ్రతము నక్తవ్రతం” అని చెప్పబడింది
పితామహ ఉవాచ:- చతుర్థ్యాం దేవ దేవోఽసౌ పూజనీయస్సదైవ హి, కృష్ణపక్షే విశేషేణ “నక్తం” కుర్యాచ్చ తద్వ్రతమ్ అపూపైర్ఘృతసంయుక్తమ్……
భాద్రపద శుక్ల చతుర్థి నాటి వ్రతం గురించి చెప్తూ మృణ్మయ మూర్తిని బంగారు మూర్తిగా భావన చేసి పూజించమని చెప్పబడింది తప్ప ప్రత్యేకంగా నక్తవ్రతం అని చెప్పబడలేదు….
భవిష్యోత్తర పురాణం:
ఇక వ్రత కల్పంలో మూలము ముఖ్యమైనదైన భవిష్యోత్తర పురాణంలో వినాయ వ్రత కల్పంలో ఏం చెప్పారో చూద్దాం
శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఉపదేశిస్తున్న వ్రత విధానం:-
ప్రాతశ్శుద్ధతిలైస్నాత్వామధ్యాహ్నేపూజయేన్నృప,
నిష్కమాత్రసువర్ణేన, తదర్థార్థేన వాపునః స్వశక్త్యా గణనాథస్య స్వర్ణరౌప్యమయం కృతం,
అథవా మృణ్మయం కుర్యాద్విత్తశాఠ్యం నకారయేత్…
పొద్దున్నే లేచి తెల్లనువ్వులు కలిపిన నీటితో స్నానం చేసి, మధ్యాహ్నం వరసిద్ధివినాయకుణ్ణి పూజించాలి.
నిష్కమాత్రం బంగారం లేదా అందులో సగంతోమూర్తిని చేయాలి లేదా వెండితోనైనా చేయవచ్చు.
ఈ రెండూ కుదరకుంటే మట్టితోనైనా చేయాలి…. లోభం మాత్రం చూపకూడదు… అని ఇలా వ్రత విధానం మొత్తం ఉపదేశిస్తారు…
నిర్ణయ సింధు:-
యత్ర భాద్రశుక్ల చతుర్థ్యాదౌ గణేశవ్రత విశేషే మధ్యాహ్న పూజోక్తా…
సంకష్ట చతుర్థీతు చంద్రోదయ వ్యాపినీ గ్రాహ్యా….
భాద్రపద శుక్ల చతుర్థి శ్రీ వరసిద్ధివినాయక వ్రతమందు మధ్యాహ్న పూజ విశేషము
సంకష్ట చతుర్థి వ్రతమునకు చంద్రోదయము పూజాసమయము అని నిర్ణయసింధు స్మృతికారులచే చెప్పబడినది.
నిర్ణయం:-
కాబట్టి ఇది నక్త వ్రతం కాదు, మధ్యాహ్నమే చేయవలసిన వ్రతం అని వ్రతకల్పం ప్రకారం సశాస్త్ర సిద్ధము….
(గృహస్థులందరికీ, స్మార్తులకూ ఇదే వర్తింపు)