క్రోధం -కాంచీ యతీంద్రులు జగద్గురు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేన్ద్రసరస్వతి స్వామివారు

జయ జయ శంకర-హర హర శంకర🙏
క్రోధం
-కాంచీ యతీంద్రులు జగద్గురు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేన్ద్రసరస్వతి స్వామివారు

కామక్రోధాలను జంటగా పేర్కొనటం ఒక పద్ధతి. కోపం అంటే అసహనం, వైరం కూడ. మనలను పాపంవైపు నడిపించేవి కామక్రోధాలే అని భగవద్గీతలో కృష్ణుడు అంటాడు. (అథ కేన ప్రయుక్తో౽యం పాపం చరతి పూరుషః- దేనిచేత మనిషి పాపం చేస్తాడు అని అర్జునుని ప్రశ్న. కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః మహాశనో| మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణమ్ || – రజోగుణంలో పుట్టిన కామక్రోధాలే.. నని కృష్ణుని జవాబు.) ఒక వస్తువుకోసం కోరికను పెంచుకున్నప్పుడు, దాన్ని ఎట్లాగే ఒక విధంగా, తప్పుడు దారిలో అయినా సరే, తీర్చుకోవాలని చూస్తాము. ఆ విధంగా మనలను పాపంలోకి పడేసేదే కామం. అది మనకున్న అతి గొప్ప శత్రువు. అటువంటి శత్రువే క్రోధం. మనం కోరుకునే వస్తువు మనకు లభించనప్పుడు అది దొరికే దారికి అడ్డువచ్చిన వారిని చూసి, అడ్డు పడుతున్నారేమో అనుకున్న వారిని చూసి మనకు క్రోధం కలుగుతుంది. ఇంకో విధంగా చెప్పాలంటే, కోరిక తీరనప్పుడు క్రోధంగా మారుతుంది.

రబ్బరు బంతిని గోడకు వేసి కొడతాము. అది మన వంకకు తిరిగి వస్తుంది. అట్లా విసిరిన బంతే కామము. అది తిరిగి మనకేసి వచ్చినప్పుడు క్రోధంగా మారుతుంది. అదేవిధంగా క్రోధంలో ఇతరులమీద దాడిచేస్తున్నామని మనం భావించినప్పటికీ, అది మనలనే ఎక్కువగా దెబ్బకొడుతుంది. క్రోధంవల్ల శరీరం అంతా కంపిస్తుంది. కోపం తెచ్చుకోవటంవల్ల మనం మన శరీరానికి, మనస్సుకూ ఎంతో కీడుచేసుకుంటున్నాము. మనం రౌద్రాకారులుగా ఉన్న వేళ, గొప్ప కోపంలో ఊగిపోతున్నపుడు ఎవరైనా మన ఛాయాచిత్రాన్ని తీసి, మనకు తర్వాత చూపిస్తే క్రోధం ఆవహించినప్పుడు మనం ఎంత అసహ్యంగా తయారవుతామో అర్థంకావటానికి అది సరిపోతుంది. అది చూశామంటే మనం సిగ్గుతో ముడుచుకుపోతాము.

సామాన్యంగా మనుషులకైనా, జంతువులకైనా అన్నం పెడితే, అప్పటికే ఆకలి తీరిపోతుంది. వేరొక సమయంలో మళ్ళీ ఆకలి అవుతుంది. కానీ మనం అగ్నిక ఆజ్యం పోస్తే అది చల్లారదు. అది ఇంకా ఇంకా ఎక్కువ మంటతో వెలుగుతుంది.
ఎక్కువ వస్తువులను తగలబెడుతుంది. నిప్పు తాను వెలుగుతో, కాంతివంతంగా ఉన్నప్పటికీ దేనిని తాకితే దాన్ని నల్లగా చేసేస్తుంది. ఈ కారణంగానే నిప్పుకు ‘కృష్ణవర్త్మ’ అని పేరు. కామం కూడా అట్టిదే. అది నిప్పువలె రగిలిస్తుంది. దానికి ఇష్టమైనదానితో పోషింపబడినది కనుక దాని ఆకలి ఎన్నటికీ తీరదు. పెరుగుతూ పోతుంది. అది మన మనస్సును నల్లగా చేసి పెట్టేస్తుంది. ఒక కోరిక తీరితే, తాత్కాలికంగా మనకు ఆనందం కలుగుతుంది. కానీ మళ్ళీ మనం అదే వస్తువును కోరి వెళ్ళి శాంతిని, సంతోషాన్ని నాశనం చేసుకుని కోపాన్ని, బాధను కోరి తెచ్చుకుంటాము. దుఃఖంనుండి ఏడుపు వస్తుంది.

క్రోధం, దుఃఖం ఒక తీరనికోరికకు రెండు ముఖాలు. మన కోరిక తీరే మార్గానికి అడ్డువచ్చేవారు మనకన్నా చిన్నవారైతే వారిపై మన కోపాన్ని ప్రదర్శిస్తాము. వారు మనకన్నా పెద్దవారైతే కోపాన్ని చూపలేకపోయినందుకు దుఃఖపడతాము. క్రోధం యొక్క దుష్టశక్తి కామంకన్నా చెడ్డది. నలుని కథలో దీనిని చాలా అందంగా తేటపరిచారు. కలిరాజు వస్తాడు. అతడి ప్రధాన అధికారులు కామము, క్రోధము కూడా వస్తారు. వారికి పరిచయ వాక్కులను పలికి స్వాగతం చెప్పేవాడు వారిని ప్రశంసచేస్తాడు. అతడు క్రోధంగురించి ఏమంటాడు? క్రోధం ప్రవేశించలేని చోటే లేదు. కామం వెళ్ళలేని ఒక చిన్న దుర్గం ఉన్నది కానీ ఈ క్రోధం ఆ కోట లోపల కూడా ఉండగలదు. అది ఏ కోటనో తెలుసునా? దుర్వాసుని హృదయం. ఆ విధంగా అతడు క్రోధంగురించి గుణగానం చేస్తాడు. దుర్వాసుడు కామమంటే ఏంటో ఎరగడు. అతడు కూడా క్రోధంవల్ల బాధితుడే.

మనం ఈ మహాపాపి అయిన క్రోధంతో ఎంతో జాగ్రత్త వహించాలి. కాస్త ఆలోచిస్తే మనకే ఒక మాట అర్ధమవుతుంది. ఎవరి మీదా క్రోధం తెచ్చుకునే అధికారం మనకు లేదు. తప్పులను చేశారని ఎవరిపై కోపాన్ని తెచ్చుకుంటున్నామో, మనం వారికన్నా ఎక్కువ తప్పులను చేసి ఉన్నాము. మనం తప్పు చేయకపోయినా అవతలివాడి పరిస్థితిలో మనం ఉంటే కోపం తెచ్చుకుని ఉండేవారమేమో అని ఆలోచించాలి.
క్రోధం మనకు చాలా పెద్ద శత్రువు. అది మన జోలికి రాకుండా మనలను
మనం కాపాడుకోవాలి.
శివాయగురవేనమః 🙏
జయ జయ శంకర-హర హర శంకర 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *