నీల లోహిత ధారణ!
( నల్లపూసల ధారణ)
స్త్రీ ఒక సంవత్సర కాలం సంతానాన్ని తన గర్బంలో మోసి మరిక ప్రాణికి జన్మనిస్తుంది.
అందువల్ల స్త్రీ నాడులకు అనుకూలమైన పధార్ధాలను ఆమెకు ఆభరణాలుగా ఏర్పాటు చేసారు.
వాటిల్లో నల్లపూసలు ఒకటి.
ముతైదువులు ధరించే ఆభరణాలు వారి దేహం పై ఆధ్యాత్మికంగాను, వైజ్ఞానికంగానూ ఉత్తమ పరిణామాల్ని కలిగిస్తాయి.
సకలదేవతల సన్నిధానయుల్తమైన, సకలతీర్థాల సన్నిధానం కలిగిన, సౌభాగ్యాలనొసగే తాళి మాంగల్యం మతైదువకు ముఖ్యమైనది.
వెనకటి కాలంలో నల్లపూసలను నల్లమట్టితో తయారు చేసేవారు.
ఈ నల్లపూసలు ఛాతీమీద ఉత్పన్నమయ్యే ఉష్ణాన్ని పీల్చుకునేవి. అదికాక పిల్లలకు పాలిచ్చే తల్లులలో పాలను కాపాడుతాయని నమ్మకం.
ఇప్పుడు నల్లపూసలు వేసుకోవడమే తక్కువ.
మనదేహంలోని ఉష్ణంతో బాటు బంగారు గొలుసు వేసుకోవడం వల్ల ఇంకా వేడిపెరిగి శరీరం వివిధ రుగ్మతలకు నిలయమౌతోంది.
ఇక ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు హృదయమధ్య భాగంలో అనాహత చక్రం ఉంది. గొంతుభాగంలో సుషుమ్న, మరియు మెడ భాగంలో విశుద్ధ చక్రం ఉంది. ఈ చక్రాలపై నల్లపూసలు ఉన్నందువల్ల హృదయం, గొంతుభాగంలో ఉష్ణం సమతులనమై రోగాలు పరిహారమౌతాయి.
ఇటువంటి పవిత్రమైన మంగళసూత్రాన్ని భర్తకు తప్ప అన్యులకు కనిపించేలా పైన వేసుకోరాదు.
వేరొకరి దృష్టి పడితే మంచిదికాదు….
స్త్రీలు నల్లపూసలతాడుకి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడమనేది ప్రాచీనకాలం నుంచి వస్తోంది.
నల్లపూసలు ఎంతో విశిష్టమైనవిగా … పవిత్రమైనవిగా భావించడమనేది మన ఆచార వ్యవహారాలలో ఒక భాగమై పోయింది. ఇటీవల కాలంలో నల్లపూసలతాడును ప్రత్యేకంగా చేయించుకుని ధరించడం జరుగుతుందిగానీ, పూర్వం మంగళ సూత్రానికే నల్లపూసలను అమర్చేవారు.
వివాహానికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ ‘నలుపు రంగు’ ను పక్కన పెడుతూ వచ్చిన వారు, సరాసరి నల్లపూసలను మంగళ సూత్రానికి అమర్చడం అంటే వాటి ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు…
అయితే నల్లపూసల ధారణ అనే మన ఆచారం వెనుక శాస్త్ర సంబంధమైన కారణం లేకపోలేదు.
వివాహ సమయంలోనే వధువు అత్తింటివారు, ఓ కన్యతో మంగళ సూత్రానికి నల్లపూసలు చుట్టిస్తారు.
ఆ మంగళ సూత్రానికి వధూ వరులచే ‘నీలలోహిత గౌరి’ కి పూజలు చేయిస్తారు.
ఈ విధంగా చేయడం వలన నీలలోహిత గౌరీ అనుగ్రహంతో, వధువు యొక్క సౌభాగ్యం జీవితకాలంపాటు స్థిరంగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది.
నాకు వివాహమును ,భాగ్యమును, ఆరోగ్యమునూ, పుత్రలాభామును, ప్రసాదించెదవు గాక! అని ప్రార్ధించి నీలలోహిత పూజను చేసి నీలలోహితే……….. బధ్యతే అనే మంత్రాన్ని చెప్పి ముత్యముల చేతనూ, పగడముల చేతనూ, కూర్చబడిన సూత్రమును కట్టాలి.
నీలలోహిత గౌరిని పూజించడం వలన … ఆమె సన్నిధిలో ఉంచిన నల్లపూసలను ధరించడం వలన వధూవరులకి సంబంధించిన సర్పదోషాలు తొలగిపోతాయని శాస్త్రం అంటోంది. అందువలన నల్లపూసలను ఓ ప్రత్యేక ఆభరణంగా భావించి ధరించకుండా, అవి మంగళ సూత్రంతో కూడి ఉండాలని స్పష్టం చేస్తోంది.
స్వస్తి!