నిరాడంబర జీవనం -కంచిపరమార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేన్ద్రసరస్వతి స్వామివారు.

శివాయగురవేనమః🙏
జయ జయ శంకర-హర హర శంకర 🙏
నిరాడంబర జీవనం
-కంచిపరమార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేన్ద్రసరస్వతి స్వామివారు.

జీవన ప్రమాణాలను పెంచడం గురించి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ప్రభుత్వం ప్రణాళికలు అన్ని దీనినే లక్ష్యంగా పెట్టుకొని ఉన్నాయని అంటారు. మనుషులు అందరికీ కావలసింది కడుపు నింపగల అన్నం, ఉండటానికి ఒక చిన్న ఇల్లు, ఎండ, చలినుండి కాపాడటానికి తన వ్యక్తిగత మానాన్ని రక్షించుకోవటానికి తగిన బట్టలు, ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేయటానికి ప్రణాళికలను ఏర్పరచాలి. వీటికన్నా మించి వెతుకులాడితే జీవన స్థితిగతులు మెరుగు కావు. నిజానికి జీవనస్థాయి బాహ్య వస్తువులు పెరిగిపోవటంలో లేదు. సంతృప్తి చెందిన మనస్సుతో హాయిగా బ్రతకటమే మరుగైన జీవితం, కోరికలను పెంచుకుని, వాటిని అందుకోవాలని జ్వరం వచ్చినట్లు వెనకబడి పరిగెత్తటం ఎవరికి తృప్తినివ్వదు. ప్రత్యక్షంగా మనం దీనిని చూస్తుంటాము. మనమేమో విదేశీయులవలె భోగభోగ్యాలను, మనోరంజనాన్ని కాంక్షిస్తూ ఉంటాము. కానీ భోగవిలాసాల జీవితపు పరాకాష్టకు చేరిన (కొందరు) పాశ్చాత్యులు దానిలో ఏ తృప్తి లేదని తెలుసుకొని, మన యోగ, వేదాంత, భక్తి మార్గాలలోనికి పెద్ద సంఖ్యలో వచ్చిపడుతున్నారు. ఇది చూసిన తరువాత కూడా మనం తెలివి తెచ్చుకోకపోతే అది చాలా దౌర్భాగ్యకరం.

ఒకరివద్ద వారి బీరువాలో చాలా బట్టలు ఉన్నాయనో, వాడు ఏ వేళ కావాలంటే ఆ వేళకు హోటలుకు పోయి ఏది కావాలంటే అది తినగలుగుతాడు అనో “వాడికి వాతానుకూలితమైన (ఏసీ) ఇల్లు ఉన్నదనో, అతడి జీవితం మెరుగైనదని అనలేము. మనస్సు సంతృప్తిగా ఉన్నప్పుడు మాత్రమే దానిని సమున్నతజీవనం అని అనగలము.

బయటి వస్తువులవల్ల సంతోషం అనేది ఎన్నడూ కలుగదు. వస్తువులను పోగుచేస్తున్న కొద్దీ ఇంకా సుఖసాధనాలు కావాలి అనిపించి, మరిన్ని వస్తువులకోసం ఎగబడతాము. ఆదాయం లేనివారికి కూడా మన విధానాలవల్ల వీటిపట్ల పిచ్చి కోరికను కలిగేటట్టు చేస్తాము. దీనివల్ల పోటీలు, పోట్లాటలు మొదలవుతాయి. జీవనస్థితిగతులను పెంచుకోవాలనే పేరుతో గట్టి ప్రయత్నాలను చేయడం ప్రారంభిస్తే, ఎప్పుడూ ఏదో ఒక వస్తువును కొంటూ పోవలసివస్తుంది. మనకు అదో, ఇదో కావాలని బలమైన కోరిక నిలిచి ఉన్నంతకాలం మనం పేదవారిగానే ఉండిపోతాము. కోటీశ్వరుల దగ్గరనుండి ప్రతివాడికి ఈ బలమైన కాంక్ష ఉన్నందువల్ల అంతా పేదవారమన్నట్టే మరి.

ధనం లేకపోతే మాత్రమే పేదరికం కాదు. చాలా ధనం ఉన్నప్పటికీ మనందరం కూడా పేదవారిగా అయిపోతున్నాము.

ఈ విలాసాలన్నీ పెరుగుతున్న కొద్దీ ఆధ్యాత్మికలక్ష్యం, మంచిమనస్సు కనుమరుగవుతున్నాయి. పాశ్చాత్యదేశాలలో ఎంతో అస్థిరత, వ్యభిచారం, హత్యలు, దోపిడీలు చూడటంలేదా? మనం వాటికి అన్నింటికీ గొప్ప పూర్ణకుంభస్వాగతం పలుకుతున్నాము. అనవసర వస్తువులను అవసరం అని భావించి, వాటిని పొందటానికి, అనవరతం ధనంకోసం ఆధ్యాత్మిక వికాసాన్ని కూడా పట్టించుకోకుండా వెతుకులాడటమే ఆధునికజీవితము. సంతృప్తి చెందిన మనస్సుతో జనులు ప్రశాంతంగా జీవనం గడిపే రోజులు పోయాయి.

ఈరోజుల్లో ఎవరికీ తృప్తి అనేది లేదు. సామాజికజీవనంలో కూడా పరస్పర సుహృద్భావన తరిగిపోయింది. పోటీ, ఓర్వలేనితనం చోటు చేసుకున్నాయి. ఎవరైనా ఆడంబరంగా ఉంటే ఇతరులకు మాత్రం అది కావాలని కోరిక పెరగటం లేదా? ప్రతివాడు తన ప్రతీ కోరికను తీర్చుకోవడం అనేది ఎన్నటికైనా సాధ్యమా? ఈ ఫలితంగా నిరాశ కలుగుతుంది. కోరిక తీరకపోతే వైరభావం జనిస్తుంది.

అందువల్ల ధనవంతులు కూడా నిరాడంబర జీవితాన్ని గడిపితే, అది వారికి మంచిది. సమాజం అంతటికీ కూడా మంచిది. పాతరోజులలో ఇట్లాగే ఉండేది. వేదరక్షణం చేస్తూ, భద్రపరిచినవారికై రాజులు ఎంతటి ధనసహాయాన్నైనా చేయడానికి సిద్ధంగా ఉండేవారు. కానీ వీరు ధనాన్ని కోరరాదని శాస్త్రాలు నిబంధన చేశాయి. ఈ కాలంలో ఇప్పటికీ వాడుకలో ఉన్న కొన్ని పదాలను చేస్తే దీనిని ఊహించవచ్చు. “ఇత్తడి కుండలు’ (బిందెలు) వజ్రపు ‘ఓలై’ అని వింటుంటాం. కుండను మట్టితో చేస్తారు. పాతకాలంలో బాగా రాబడి ఉన్నవారు కూడా మట్టిపాత్రల్లోనే వండుకునేవారు. అటు తరువాత ఇత్తడి గిన్నెలు వచ్చాయి. ఇక మట్టికుండ (తమిళంలో) ‘ఇత్తడికుండ”గా మారింది.
‘ఓలై’ అంటే తాటి ఆకుల చుట్టు. శ్యామలాదండకంలో విశ్వమాత కూడా తాటంకముల (తాటిఆకుతో చేసిన చెవికమ్మలను) ధరిస్తుంది అని చెబుతారు. తరువాత వజ్రాల చెవిరింగులు వచ్చాయి. అయినా ఆ పాత ‘ఓలై’ అనే పేరు ‘వైర ఒలై’ (వజ్రపు చెవికమ్మ)తో కూడా వచ్చి చేరుకుంది. పాత రోజులలో సంపన్నులు కూడా ఎనిమిది అంతస్తుల మేడలు కట్టేవారు కాదు. ఇళ్ళన్నీ దాదాపు సమానంగా ఉండేవి. మన శిల్పము మొదలైన శాస్త్రాలను ప్రదర్శించడానికి రాజులు, వారి మంత్రులకు పెద్ద భవంతులు ఉండేవి. సామాన్య జనులకు మార్గదర్శకులైన బ్రాహ్మణులు మాత్రం చిన్న ఇళ్ళలో ఉండేవారు. కానీ గొప్ప జీవితాన్ని జీవించేవారు. వారు అన్ని విధాలా సరళంగా, నిరాడంబరంగా జీవించాలని శాస్త్రాలు నిబంధన చేశాయి. ఏ చోట చూసినా, గుడి అనేది మాత్రమే భవంతికన్నా కూడా చాలా పెద్ద కట్టడంగా ఉండేది. గుడిలో దేవుడికి మాత్రమే. చాలా నగలు విలువైన ఆభరణాలు ఉంటుండేవి. గుడిలో జరిగే ఉత్సవం ఆ ప్రాంతానికి అంతటికి పెళ్ళిలాగా ఉంటుండేది. విందులు, తేనీటి సమాగమాలు (టీపార్టీ) వ్యక్తిగత ఆడంబరాలూ అస్సలు ఉండేవి కావు. కలిగి ఉన్నవారు కూడా నిరాడంబరంగా బ్రతికినంతకాలం ఇతరులకు వారిపట్ల వైరభావాలు లేవు. వారు వేదరక్షణను విడిచిపెట్టి, ఊరు వదిలి ధనవేటలో నగరాలకు వెళ్ళిపోయిన తరువాత, సమాజంలోని సహృదయ భావన అంతా నాశనమైపోయింది. ఆ పాతరోజులలోని సరళమైన జీవితానికి అందరూ తిరిగివెళ్ళటానికి ప్రయత్నించాలి.

గాంధీ బ్రతికి ఉన్నంతకాలం నిరాడంబరజీవితం గురించి కనీసం మాట్లాడటమైనా ఉంటుండేది. ఆ దృష్టి కూడా ఇప్పుడు లేకుండా పోయింది. చేతనైనంతవరకు మనుషులు దానివైపు మరలాలి. సంతృప్తి అనేది మనస్సులో ఉంటుందని గ్రహించి, కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ, ఆడంబరం లేని జీవితాన్ని జీవించాలి. మనుషులంతా వారి కోరికలను తగ్గించుకొని, నిరాడంబరత ఆధారంగా సమృద్ధజీవితాన్ని జీవించాలని చంద్రమౌళీశ్వరస్వామి మనలను దీవించుగాక.
శివాయగురవేనమః 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *